Saturday 26 November 2016

క‌ష్ట‌జీవి ఇంట ఆగ‌ని మ‌ర‌ణ‌మృదంగం

ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ఎరువు బరువై… కూలీలు కరువై. నీరు కన్నీరై… విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి… రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా… బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే… బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. 1995 నుంచి 2013 మధ్య… అంటే 19 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 38,470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం మన పొరుగునే ఉన్న మహారాష్ట్రది. ఆ తర్వాతి స్థానం… ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడేళ్లుగా… కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుండగా… మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’ అని చెప్పుకొన్న కాలంలోనూ పెద్ద సంఖ్యలో రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1995-2002 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 12,716 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  2003-2010 మధ్యకాలంలో బలవన్మరణం పాలైన అన్నదాతల సంఖ్య ఏకంగా 18,404కు చేరింది. ఒకవైపు రైతుల వారసులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలు చూసుకుంటుండగా… మరోవైపు హలం బాట పట్టిన యువ రైతులు మధ్యలోనే జీవితమనే కాడిని పారేస్తున్నారు. యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ… అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతి, పెట్టుబడులూరాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల అని తేల్చేస్తారు. కాదు గిట్టుబాటు ధరలు దక్కక లేదా కరెంటు సరఫరా కరువై నీటి సరఫరా లేక పంట ఎండిపోతేనో లేక పండిన పంట అమ్మితే అప్పులు తీరడం లేదనో ఇలా అనేక కారణాల వలన రైతులు తమ ఉసురు తామే తీసుకుంటున్నారని లోకం అంతా కోడై కూస్తున్నపుడు ‘మీ హయాంలో జరగలేదా?’ అని ప్రతిపక్షాలతో సవాలు చేయడం పాలకవర్గాలు చేస్తున్న ఎదురు దాడి. అందరి ఆకలి తీర్చేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పెను సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగు భారమై చాలా మంది బలవన్మరణాల పాలవుతున్నారు. మరికొందరు సాగు వదిలి పొట్ట కూటి కోసం వలసపోతున్నారు. రైతుల మూలుగ పీల్చేస్తున్న సంక్షోభానికి ప్రభుత్వ విధానాలతోపాటు మనమూ కారణమే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గత పందొమ్మిది సంవత్సరాలలో భారత దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నదీ రాష్ట్రాలవారీగా, సంవత్సరాల వారీగా లెక్కలు సేకరించి నివేదిక వెలువరించింది. ఇక ఏ రాజకీయ పార్టీ కూడా మా హయాంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోలేదని బొంకడానికి వీల్లేదు. అధికారికంగానే రైతులూ ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వానికి చెందిన విభాగం ఒకటి నివేదిక రూపొందించిన త‌ర్వాత ప్ర‌భుత్వాలు ఆత్మహత్యలకు కారణాలు వెతుక్కోవాల్సిందే. ఎన్.సి.ఆర్.బి నివేదిక ప్రకారం 1995 నుండి 2013 వరకూ 19 సంవత్సరాల కాలంలో 296438 మంది రైతులు దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంస్ధ ఆత్మహత్యల సంఖ్యని రికార్డు చేయడం ప్రారంభించింది 1995 నుండే కనుక అంతకు ముందు, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుందీ తెలిసే అవకాశం లేదు. బహుశా మానవజాతి చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకున్న దౌర్భాగ్యం మ‌రే దేశంలోనూ జ‌రిగి ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. దేశానికి అన్నం పెట్టే రైతు, దేశానికి వెన్నెముకగా రాజకీయ నాయకులు ఇష్టంగా చెప్పే  క‌ర్ష‌కుడు,  ప్రాధమిక ఉత్పత్తిదారుడైన వ్య‌వ‌సాయ‌దారుడు ఆత్మహత్య చేసుకోవడం అంటే… ఈ దేశంలో బతకడానికి తావు లేనట్లే. మహా రాష్ట్ర రైతు ఆత్మహత్యలలో అగ్ర స్ధానంలో నిలిచింది. దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రైతు ఆత్మహత్యలలో కూడా అంతే సంపన్నంగా ఉండడం యాదృచ్ఛికం కానే కాదు. భారత దేశంలో అలవిగాలినంతగా ధనాన్ని సంపాదించడానికీ, రైతులు లాంటి ప్రాధమిక ఉత్పత్తిదారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి నేరుగా సంబంధం ఉన్నందునే మహారాష్ట్రకు ఆ ఖ్యాతి దక్కింది. ఇంకా చెప్పాలంటే మొత్తం ఆత్మ హత్యలలో మూడింట రెండవ వంతు ఐదు రాష్ట్రాలలోనే జరిగాయి. మహా రాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాలు ఆ పేరు దక్కించుకున్నాయి. వీటిలో చత్తిస్ ఘఢ్ మినహా మిగతా నాలుగూ సంపన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. అంకెలను పరిశీలిస్తే మొదటి ఎనిమిది  సంవత్సరాల కంటే త‌ర్వాతి  ప‌ది సంవ‌త్స‌రాల్లో ఆత్మ‌హ‌త్య‌ల శాతం పెరిగింది. 1995-2002 కాలంలో 1,21,157 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2003-2013 కాలంలో 1,75,281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటును చూస్తే ప్ర‌తి ఏటా 15602 మంది రైతులు బ‌ల‌వంతంగా త‌నువు చాలిస్తున్నారు. వ్యవసాయరంగం పైన ఆధారపడిన రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న నేపధ్యంలో ఈ దుర‌వ‌స్థ  ఆందోళనకర అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వర్షాధార పంటలు పండించే మెట్ట ప్రాంతాల్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్న రాష్ట్రాలు నాలుగు.. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్. దేశంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో 68% మంది ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. మన రాష్ట్రంలో గత 19 ఏళ్లలో 38,470 మంది రైతు లు ఆత్మహత్యల పాలయ్యా రు. ప్ర‌తి ద‌శాబ్దంలోనూ వ్య‌వ‌సాయం పై ఆధార‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోతోంది. 1991 జనాభా లెక్కలతో పోలిస్తే 2001 జనాభా లెక్కలలో 7 మిలియన్ల మంది రైతులు వ్యవసాయం నుండి పక్కకు తప్పుకున్నారని తేలింది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం తీసుకుంటే ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా త‌యారైంది. 8.6 మిలియ‌న్ల మంది వ్య‌వ‌సాయం నుంచి తొల‌గిపోయారు. రైతుల స్థితి కూడా మారిపోయింది. చాలామంది వ్య‌వ‌సాయ కూలీలుగా మారిపోయారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే 37 మిలియ‌న్ల మంది వ్య‌వ‌సాయ కూలీలుగా మారారు. దేశవ్యాప్తంగా వ్య‌వ‌సాయ రంగం పై ఆధార‌ప‌డిన వారి శాతం కూడా క్షీణిస్తోంది. 2001 లెక్క‌ల‌తో పోల్చితే 2011 నాటికి 3.4 శాతం త‌గ్గిపోయారు. రైతు చుట్టూ అనేక అనుబంధ పనులు చేసుకునే వారు ఉంటారన్నది గమనిస్తే మొత్తంగా వ్యవసాయ రంగం నుండి తప్పుకున్నవారి సంఖ్య క‌నిపంచే లెక్క‌ల‌కు అనేక రెట్లు ఉంటుంది. 2011 జనాభా గణన ప్రకారం.. మన రాష్ట్రంలో రోజుకు 375 మంది రైతులు వ్యవసాయం  మానేస్తున్నారు. 2001-2011 మధ్య పదేళ్లలో 13,68,012 మంది వ్యవసాయం వదిలేసి వేరే పనులు చేసుకుంటున్నారు. అయినా, సంక్షోభ తీవ్రతను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సంబంధించి 2004 జూన్1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.421ను జారీచేసింది. బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారంతోపాటు రుణబకాయిల చెల్లింపులకు మరో రూ.50 వేలు కూడా ఇచ్చింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే, బాధిత కుటుం బం పరిహారానికి అర్హమైనదా కాదా అని నిర్ణయించే ప్రక్రియలో ‘న్యాయమైన రైతు ఆత్మ హత్యలు’ అనే కొత్త వర్గీ కరణను ఈ రెండు రాష్ట్రా ల్లోనూ ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా బాధిత కుటుంబాలకు సహాయం అందకుండా పోతోంది. గడ‌చిన ద‌శాబ్ద‌కాలంలో రైతుల నుంచి లక్షల ఎకరాలను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమల పేరుతో, సెజ్ ల పేరుతో ధనికులకు అప్పజెప్పింది. ఇక  పట్టణాభివృద్ధి, ఇతర అభివృద్ధిల పేరుతో కూడా లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అతి తక్కువ ధరలకు కట్టబెట్టింది. ఈ ప‌ర్య‌వ‌సానం రైతుల సంఖ్య మరింతగా పడిపోయి, సేద్యం భూములు మరింతగా తగ్గిపోయాయి. భారత దేశంలో వ్యవసాయ సంక్షోభం పెరుగుతున్న కొద్దీ రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్ధాయిలో పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ చెపుతున్న లెక్క‌లు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం అధికారం చ‌లాయించే ఏ ఒక్క‌రికీ ఇష్టం ఉండ‌దు. అది యుపీఏ స‌ర్కారైనా, ఎన్డీఏ స‌ర్కారైనా.దేశం ఆర్ధిక వృద్ధిలో అతివేగంగా దూసుకు పోతుంటే ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోకి రాకూడదన్నది పాల‌కుల అవగాహ‌న. కాని ఉత్పత్తి రంగంలో ఉన్న దాదాపు అన్ని రంగాలకూ వ్యవసాయ ఉత్పత్తులే మూలాధారం అన్నది గమనిస్తే రైతుల పట్ల ఎంతటి చిన్న చూపు ప్రభుత్వం చూపుతున్నదో, ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నదో అర్ధం అవుతుంది. వ్య‌వ‌సాయ రంగం ఇంత‌గా దెబ్బ‌తిన‌డానికి చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. నీటి వ‌స‌తి అంతంత మాత్రంగా ఉంది. గిట్టుబాటు ధ‌ర‌లు లేవు. పెట్టిన కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు. రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించేలా వారిని చైత‌న్య‌ప‌ర్చ‌డం లేదు. చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు. అన్నింటికీ మించి వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు. వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.ఇలాంటి కార‌ణాలను విశ్లేషిస్తే మ‌రెన్నో స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయి. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి పాల‌కుల్లో చిత్త‌శుద్ధి కాన‌రాదు. క‌మిటీలు వేయ‌డం, ఆ క‌మిటీలు ఇచ్చిన సిఫార్సుల‌ను చెత్త‌బుట్ట‌లో వేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం గా మారింది. జ‌య‌తీ ఘోష్ క‌మిటీవ్య‌వ‌సాయ సంక్షోభాన్ని నివారించ‌డానికి ఎన్నో సిఫార్సులు చేసినా వాటిని ప‌ట్టించుకోలేదు. భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తిలో గ‌తంలో 64శాతం వ్యవసాయ మీదనే ఆధారపడేవారు. ఇప్పుడ‌ది 55శాతం లోపుకు వ‌చ్చింది. అయినా  గ్రామాల్లో నివసించే వారిలో నాల్గింట మూడో వంతు మందికి వ్యవసాయమే ఆధారం. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశజనాభాలో 70 శాతం వ్యవసాయరంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. అప్పటి జాతీయ ఆదాయంలో 55 శాతం వాటా వ్యవసాయరంగం నుంచి ఉంది. వ్యవసాయ అభివృద్ధిరేటు పెరుగుతుందని అనుకున్నా అదే దామాషాలో రైతుల ఆదాయాలు పెరగలేదు. ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణమైన గిరాకీ ఉంటేనే వ్యవసాయోత్పత్తులకు వాస్తవ ధరలు నిలకడగా ఉంటాయి. వ్యవసాయం ద్వారా లభించే  ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడంతోపాటు, వైవిద్య మైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయాలి. దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. దానిని పటిష్టపరచాలి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను విస్తారంగా ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి సమృద్ధిగా నీరు, సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక చేయూత అందించాలి. వ్యవసాయరంగానికి వాటర్‌మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా అమలు చేయాలి. వ్య‌వసాయరంగాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిం చాలి. వారికి అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలి. అవసరమైన చోట చెక్‌ డ్యాంలను నిర్మించాలి. ప్రకృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు ప్రభుత్వం వారికి అండగా నిలవాలి. వ్యవసాయరంగంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విప్ల వాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధి కోసం అధికనిధులను వెచ్చించాలి. ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలురైతులకు సక్రమంగా అందేలా చూడాలి. భూములను అవసరమైన ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి చిన్న రైతులకు చేయూతనివ్వాలి. కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి రైతుల పంట మార్కెట్‌కు చేరేదాకా రక్షణ ఇవ్వాలి. రైతులకు కల్తీలేని విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కౌలురైతులకు పంటరుణాలు అందించే ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల్లో బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అవినీతి, అక్రమం, అనాలోచిత లైసెన్సు విధానం, పర్మిట్‌, కోటా విధానాలు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. పంట పొలాల్లో మరణ మృదంగం ఇప్పటికీ మోగుతూనే ఉంది. మనందరికీ అన్నవస్త్రాలు అందించడానికి చెమటోడ్చు తున్న రైతులు అపసవ్యమైన ప్రభుత్వ విధానాల కార‌ణంగా ఆత్మహత్యల పాలవుతుండడం జాతికే అవమానం. తప్పుడు వ్యవసాయ పద్ధతులను, విధానాలను బలపరచడం, ప్రోత్సహించడం వంటి కార‌ణాలే కాదు వాటి నిరోధానికి స‌మ‌ష్టి కృషి అవ‌స‌రం.

No comments:

Post a Comment